రుద్రంపూర్, జనవరి 22 : మణుగూరు ఏరియా సింగరేణి మల్లేపల్లి ఓపెన్‌కాస్ట్‌లో ఇటీవల పనులు చేపట్టిన యాజమాన్యం పనుల్లో ఉపయోగిస్తున్న వాహనాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రవాణా శాఖ అధికారి పి.భూషిత్ రెడ్డిని కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ భాషబోయిన రవికుమార్ ఆధ్వర్యంలో కలిసి మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని, సాంకేతిక లోపాలతో ఉన్న వాహనాలను యథేచ్ఛగా నడుపుతూ కార్మికుల భద్రత, ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల్లో బ్రేకులు, లైట్లు, సేఫ్టీ అలారాలు వంటి మౌలిక సదుపాయాలు సరిగా లేకపోయినా, అక్కడి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు.
1988 మోటార్ వెహికల్స్ యాక్ట్, 1948 లేబర్ యాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేని వాహనాలను నడిపించడం ద్వారా కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఎప్పుడైనా ఘోర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని, ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. సంబంధిత శాఖలు తక్షణమే తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని, ఫిట్నెస్ ఉన్న వాహనాలనే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలకు దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరిస్తున్నారు.