రామవరం, డిసెంబర్ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని విజయవాడ– జగదల్పూర్ జాతీయ రహదారిపై రామవరం వద్ద ఉన్న మాతా-శిశు ఆరోగ్య కేంద్రం సమీపంలో యూ–టర్న్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రికి తీసుకువచ్చే అంబులెన్స్, వచ్చే రోగులు, బంధువులు ఎదురు ప్రయాణం కోసం రాంగ్ రూట్లోనే వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు నెలకొంటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు ఈ మార్గంలో వందలాది వాహనాలు సంచరిస్తుంటాయి. అయితే సమీపంలో యూ–టర్న్ సౌకర్యం లేకపోవడంతో, ఉన్న యూటర్న్ 14 నంబర్ వద్ద, టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉండడంతో అది దూరం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో ప్రజలు షార్ట్‌కట్‌గా రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు. ఇది కాస్త ప్రమాదాలకు దారి తీస్తోంది. అధికారులు స్పందించి మాతా-శిశు ఆరోగ్య కేంద్రం వద్దా లేదా సమీపంలోనే శాశ్వత యూ–టర్న్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు, సామాజిక సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.