ఇల్లెందు, డిసెంబర్ 08 : సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో న్యాయస్థానం ఇద్దరు వ్యక్తులకు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన ఇల్లెందులో చోటుచేసుకుంది. 2016లో సిలువేరు సదానందం, సిలువేరు రమేశ్/మచ్చ వెంకన్న అను ఇద్దరు సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు తిరిగి అడగడంతో చంపుతామని వారిని బెదిరించారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. విచారణలో సదరు వ్యక్తులు దోషులుగా తేలడంతో ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇల్లెందు డి.కీర్తి చంద్రిక రెడ్డి మూడేండ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసులో ప్రాసిక్యూషన్ తరపున నర్సింగ్ అనిల్ కుమార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.