భద్రాచలం: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ సినిమా (OG Movie) విడుదల సందర్భంగా భద్రాచలంలోని (Bhadrachalam) ఏషియన్ థియేటర్లో అప్రశ్రుతి చోటుచేసుకున్నది. పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో టాకీస్‌లోని సౌండ్ బాక్సులు ఊడి కిందపడిపోయాయి. దీంతో ఇద్దరు ప్రేక్షకులు తీవ్రంగా గాయపడ్డారు.
పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయింది. ఇందులో భాగంగా గురువారం ఉదయం భద్రాచలంలోని ఏషియన్ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నవారితోపాటు, టికెట్ లేనివారు కూడా టాకీస్‌లోకి ప్రవేశించారు. దీంతో ప్రేక్షకులతో థియేటర్ కిక్కిరిసిపోయింది. పరిమితి కంటే ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో అంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో థియేటర్లోని సౌండ్‌బాక్సులు ఊడి ప్రేక్షకుల మీద పడిపోయాయి. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిబ్బంది వారిని స్థానిక దవాఖానకు తరలించారు. కాగా, సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మందిని అనుమతించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు. టాకీస్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.