రామవరం, మే 21 : గనిలో విష వాయువులు వెలువడంతో అధికారులు అప్రమత్తమై నష్ట నివారణ చర్యలకు పూనుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే5 ఇంక్లైన్ భూగర్భ గనిలో ఆదివారం సెకండ్ షిఫ్ట్ లో విష వాయులు వెలువడుతున్న విషయాన్ని గుర్తించి యుద్ధ ప్రాతిపదిక నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సహజంగా భూగర్భ గనుల్లో ఉండే బొగ్గు తనంతట తాను వేడెక్కుతుంది. ఆ సమయంలో భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల కోసం పంపించే గాలి దానికి తగలడంతో అది మండి కార్బన్ మొనాక్సైడ్ అను విషవాయును వెలువరిస్తుంది. గనిలోని 73 లెవెల్, 7 రేస్ వద్ద గ్యాస్ పడినట్లు తెలుస్తుంది. విషయాన్ని అధికారులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు.
గ్యాస్ పడిన ప్రాంతంలో గాలి వెళ్లకుండా గోడలు నిర్మించాలా? స్టావింగ్ విధానం ద్వారా ఇసుక లేక నీటిని పంపించి మంటలను ఆర్పే పనులను వేగవంతం చేస్తున్నారు. పాత పీవీకే ఫ్యాన్ వద్ద పనిచేసే ఉద్యోగులు గ్యాస్ పడిన విషయాన్ని గాలి ద్వారా గుర్తించకపోవడం వల్లే దీని తీవ్రత ఎక్కువైనట్లు తెలుస్తుంది. అక్కడ విధులు నిర్వహించిన ఉద్యోగులు గుర్తించి అధికారులకు తెలియపరిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. అంతేకాకుండా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే ఏరియాలోని ఉన్నతాధికారులు గని వద్దకు చేరుకుని నష్ట నివారణ చర్యలను ఏ విధంగా చేపట్టాలి తదితర అంశాలను చర్చిస్తున్నారు.