రామవరం, జూలై 30 : రుద్రంపూర్ పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ ప్రాంతంలోని సులబ్ కాంప్లెక్స్ నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. ప్రతి గురువారం రుద్రంపూర్ మార్కెట్ సెంటర్కు రుద్రంపూర్, గౌతమ్ పూర్, ధన్బాద్, మాయాబజార్, పెనగడప, లక్ష్మిపురం తండా, రుద్రంపూర్ తండా, త్రీ ఇంక్లైన్ లైన్, ఫోర్ ఇంక్లైన్, రామవరం తదితర ప్రాంతాల నుండి కార్మికులు, ప్రభావిత ప్రాంత ప్రజలు ఇక్కడ నిర్వహించే అంగడికి వచ్చి వారికి కావాల్సిన సరుకులను కొనుగోలు చేస్తుంటారు. వీరి సౌకర్యార్థం టీబీజీకేఎస్ కృషితో సింగరేణి అధికారుల సహకారంతో రూ.8 లక్షల వ్యయంతో ఇక్కడ పురుషులకు నాలుగు, మహిళలకు నాలుగు చొప్పున సులబ్ కాంప్లెక్స్ నిర్మించారు. అయితే నిర్వహణ లేమి కారణంగా అది అస్తవ్యస్థంగా తయారైంది.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా సులబ్ కాంప్లెక్స్ ముందు పూర్తిగా బురదమయమై చిత్తడిగా మారిపోయింది. సులబ్ కాంప్లెక్స్ ఉపయోగించుకునేందుకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. గత గురువారం సంతకు వచ్చిన ముగ్గురు మహిళలు జారిపడ్డారు. సులబ్ కాంప్లెక్స్ ముందు ఫ్లోరింగ్ లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి అక్కడ బుడదమయంగా మారుతుందని, అధికారులు కాంప్లెక్స్ ముందు సిమెంటుతో గచ్చు చేయించాలని అప్పటివరకు బురదలో జారి పడకుండా ఉండేందుకు తాత్కాలికంగా ఎస్ఆర్టీ ఏరియాలో కూల్చివేసిన మట్టి పొడినైనా పోస్తే ఉపయోగంగా ఉంటుందని వర్తక సంఘం అధికారులను కోరింది. అంతేకాకుండా సులబ్ కాంప్లెక్స్ నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకుల్లో పూర్తిగా నాచు పేరుకుపోయిందని, వాటిని కూడా శుభ్రం చేయాలని పేర్కొన్నారు.