పాల్వంచ, ఫిబ్రవరి 02 : పీఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ నెల 4వ తేదీ నుండి మూడు రోజుల పాటు ఇన్నోవేషన్, డిజైన్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ (IDE) బూట్ క్యాంప్ పాల్వంచలోని అనుబోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమవుతున్నట్లు కళాశాల చైర్మన్ తలశిల భరత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల విద్యా, సాక్షరత విభాగం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ (MIC) సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బూట్ క్యాంప్‌నకు వాధ్వానీ ఫౌండేషన్ అకాడమిక్ మద్దతు అందిస్తోందన్నారు.
ఈ బూట్ క్యాంప్ ద్వారా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల్లో ఆవిష్కరణ ఆధారిత బోధనా విధానాలు, వ్యాపార దృక్పథం మరింత బలోపేతం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ఇతర ప్రాంతాల్లో పీఎం శ్రీ పాఠశాలల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో డిజైన్ థింకింగ్, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలపై ఇంటరాక్టివ్ సెషన్లు, హ్యాండ్స్-ఆన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.