కొత్తగూడెం టౌన్, జూలై 10: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలోని పలు మండలాల్లో, పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి బంగారం, వెండి, నగదులను దొంగిలించిన దొంగను సుజాతనగర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడితోపాటు, దొంగ సొత్తు అని తెలిసీ వాటిని కొనుగోలు చేసిన వ్యక్తులను షేక్ ధారుక్ బాబా, నలమటి సాయిరామ్, విజయరావును అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు, భద్రాచలం, అశ్వాపురం, మణుగూరు, చర్ల ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. నిందితుల నుంచి 360 గ్రాముల బంగారం(36 తులాల), 1020 గ్రాముల(102 తులాల) వెండి, ఒక మోటార్ సైకిల్, ఒక మొబైలు ఫోన్, దొంగతనం చేయడం కోసం ఉపయోగించిన ఒక ఇనుప రాడ్, రెండు స్క్రూ డ్రైవర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డీఎస్పీ వెల్లడించారు.
కాగా, కేసును చేదించి, నిందితులను పట్టుకోవడంతో పాటు దొంగలించిన బంగారం, వెండి వస్తువులను రికవరీ చేయడంలో సహకరించిన సీసీఎస్ సీఐ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్, రామారావు, వారి సిబ్బందిని, క్లూస్ టీం సీఐ అశోక్ కుమార్ వారి సిబ్బందిని, ఈ కేసులను పర్యవేక్షించిన కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సీఐ ఆర్. వెంకటేశ్వర్లు, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సుజాతనగర్ ఎస్ఐ ఎం. రమాదేవి, వారి సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
అభినందించారు.