రామవరం, మే 31 : తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అత్యుత్తమ ఆస్తి చక్కని చదువు సంస్కారాలే అని మౌలానా ముఫ్తీ యాకుబ్ అన్నారు. శనివారం రామవరం జామా మసీదులో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే మానవతా విలువలు, పెద్దల పట్ల గౌరవం కలిగి జీవించేలా శిక్షణ ఇవ్వాలని ఇస్లాం బోధిస్తుందని తెలిపారు. ప్రాపంచిక విద్యతో పాటు ధార్మిక విద్య కూడా నేర్పాలని సూచించారు.
మోడ్రన్ ఇఖ్రా స్కూల్ కరస్పాండెంట్ షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ.. నిజమైన జ్ఞానం మనిషిని మంచి మనిషిగా సత్ సమాజ నిర్మాణానికి అవసరమైన ఉత్తమ భావి పౌరుడిగా తీర్చిదిద్దుతుందన్నారు. మసీదు కమిటీ వారు పిల్లలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మసీదు అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్, శిక్షణ శిబిరం పర్యవేక్షకుడు మౌలానా ఇస్మాయిల్ మాట్లాడుతూ.. రామవరం ప్రజల సహాయ సహకారాలతో నెల రోజుల శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసిందన్నారు. పిల్లలో క్రమశిక్షణ, సమాజం పట్ల అవగాహన కలిగి ఉండేలా శిక్షణ ఇవ్వడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పిల్లలు, వారి తల్లిదండ్రులు, మౌలానా రఫీ, అహ్మద్ సాబ్, జమాతే ఇస్లామి హింద్ రామవరం శాఖ అధ్యక్షుడు మాజీద్ రబ్బానీ, సీనియర్ నాయకులు గౌస్ బాయ్, జానీ, రసూల్, హాజీ షోఖత్, ముజాహిద్, కరీం, అఫ్జల్, అస్లం, జావీద్, నజీర్, ఫయాజ్ మాస్తాన్ పాల్గొన్నారు.