కారేపల్లి, ఆగస్టు 05 : పల్లెల్లో ప్రథమ చికిత్స అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న గ్రామీణ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) దాడులు చేయడం ఆపాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం కారేపల్లిలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీజీఎంసీ అనుచిత దాడులతో గ్రామీణ వైద్యులను భయభ్రంతలకు గురిచేస్తుందన్నారు. 2004లో వైస్ రాజశేఖర్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ వైద్యులకు పారామెడికల్ బోర్డు ద్వారా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించే కార్యక్రమం చేపట్టిందన్నారు. దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 65వేల మంది ధరఖాస్తులు చేసుకున్నారని దానిలో 55 వేల మంది అర్హులుగా తేల్చారన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంతో దానికి నిధులు కేటాయింపు లేక ఆ పక్రియ నిలిచిపోయిందన్నారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పక్రియను కొనసాగిస్తుందని ఆశించామన్నారు. టీజీఎంసీ గ్రామీణ వైద్యులపై దాడి చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవటం విచారకరమన్నారు.
క్వాలీఫైడ్ వైద్యులు పల్లెలో వైద్య సేవలు అందించటానికి ముందుకు రాక పోవటంతోనే ప్రజలు గ్రామీణ వైద్యులపై ఆధారపడుతున్నారన్నారు. గ్రామీణ వైద్యులను గ్రామీణులే రక్షించుకుంటారన్నారు. గ్రామీణ వైద్యులు బతుకుదెరువు కోసం పోరాటాలు చేయాల్సి పరిస్ధితిని టీజీఎంసీ తీసుకువస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పంధించి గ్రామీణ వైద్యుల సేవలకు చట్టబద్దత తీసుకురావాలని కోరారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 7న సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనిద్వారా గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పించటం జరుగుతుందన్నారు. దీనికి అన్ని పార్టీల నాయకులకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతారపు వెంకటాచారి, కార్యదర్శి జి.వెంకట్రామయ్య, మండల నాయకులు వీరయ్యచౌదరి, రఘు, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.