రుద్రంపూర్, మే 18 : తెలంగాణ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలీసెట్-2026 అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, టీజీ పాలీసెట్-2026 కన్వీనర్ ఎ.శ్రీదేవసేన ఐఏఎస్ విడుదల చేశారు. సోమవారం నాంపల్లిలోని విద్యాభవన్‌లో నిర్వహించిన అడ్మిషన్ కమిటీ సమావేశంలో ఈ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్టు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ మే 27 నుంచి ప్రారంభం కానుంది. మే 27 నుంచి 31 వరకు ఆన్లైన్లో బేసిక్ సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, హెల్ప్‌లైన్ సెంటర్ ఎంపిక కోసం స్లాట్ బుకింగ్ నిర్వహించనున్నారు. మే 29 నుంచి జూన్ 1 వరకు సర్టిఫికెట్ ధృవీకరణ చేపట్టనుండగా, జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 6న సీట్ల కేటాయింపు ప్రకటించి, జూన్ 9 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
తుది దశ కౌన్సెలింగ్ జూన్ 15 నుంచి ప్రారంభమవుతుంది. మొదటి దశలో హాజరుకాని అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తూ జూన్ 15న స్లాట్ బుకింగ్, జూన్ 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. జూన్ 20న తుది సీట్ల కేటాయింపు చేపట్టి, జూన్ 24 నాటికి కళాశాలలు జాయినింగ్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంతర్గత స్లైడింగ్ , స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. జూలై 1న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు ప్రకటించి, జూలై 8 వరకు స్పాట్ అడ్మిషన్లు పూర్తి చేయనున్నారు. అభ్యర్థులు వీలైనంత త్వరగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు, హెల్ప్‌లైన్ కేంద్రాల జాబితా, కోర్సుల వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.