రుద్రంపూర్, సెప్టెంబర్ 09 : రుద్రంపూర్ జడ్పీహెచ్ఎస్లో తెలంగాణ భాషా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలాజీ మాట్లాడుతూ.. విద్యార్థులకు చదవడం, రాయడం, చదివిన విషయాన్ని అర్థం చేసుకోవడం, స్పందించడం వంటి నైపుణ్యాలు తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. తెలుగు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్, పద్య, శ్లోకాల పోటీలు నిర్వహించారు.
10వ తరగతి విద్యార్థిని యశ్విత తెలంగాణ తల్లిగా ఏకపాత్రాభినయం చేసి ఆకట్టుకోగా, సాత్విక్ కాళోజీ పాత్రలో అలరించాడు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట రాజు, మదర్ థెరిసా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యాకయ్యతో పాటు ఉపాధ్యాయులు లక్ష్మి, రాధ, రజియా సుల్తానా, వెంకటేశ్వర్లు, గణేష్ కుమార్, కవిత, కృష్ణవేణి, విజయనిర్మల, పాఠశాల సిబ్బంది గోవర్ధనచారి, ధీరజ్, ఉమా పాల్గొన్నారు.