రుద్రంపూర్, మే 18 : చైతన్య సాహిత్య పరిషత్ సౌజన్యంతో, అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు భద్రాద్రి కొత్తగూడెం రామవరానికి చెందిన సయ్యద్ అబ్దుల్ సత్తార్‌కు ఆహ్వానం అందింది. 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా 2026 జూన్ 6, 7 తేదీల్లో అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ మహాసభలకు దేశ విదేశాల నుండి ప్రముఖ కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు, భాషాభిమానులు హాజరుకానున్నారు.
తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సంప్రదాయాల పరిరక్షణతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వైభవాన్ని చాటిచెప్పే లక్ష్యంతో ఈ సాహిత్య మహాసభలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలుగు భాషను భావ వ్యక్తీకరణకు మాత్రమే కాకుండా, జాతి సంస్కృతికి ప్రతీకగా భావిస్తూ భాషా, భావ, ధర్మ పరిరక్షణకు ఈ మహాసభలు వేదిక కానున్నాయి. ఈ సందర్భంగా సయ్యద్ అబ్దుల్ సత్తార్ ఎంపికపై సాహిత్య, సామాజిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మహాసభల్లో పాల్గొనే ప్రతినిధులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, సాహిత్య పురస్కారాలు అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.