– కొత్తగూడెం క్లబ్లో సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ
– పాల్గొన్న ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు
కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 09 : మరణించినా ప్రజల గుండెల్లో జీవించేవారు చాలా అరుదుగా ఉంటారని, ఆ కోవకు చెందిన వారే సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అని, ప్రజా ఉద్యమాలకు ఆయన ఒక దిక్సూచి, కాంతిరేఖ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాచారు. 15 ఏళ్ల వయస్సు నుండే ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, రైతు సంఘం, కార్మిక సంఘం, పార్లమెంట్ సభ్యుడిగా సుమారు 60 సంవత్సరాలకు పైగా ప్రజా సేవలోనే ఉండి ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి సుధాకర్ రెడ్డి అని, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాలలో ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.
భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పేదల పక్షాన పోరాటం చేసిన నాయకుడు సురవరం అని, కార్మిక, రైతు, ప్రజా సంఘాల నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేసి తన జీవితాన్ని పేద ప్రజలకు అంకితం చేశారని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ప్రతీవాడు కమ్యూనిస్ట్ అని, ఓట్లు, సీట్లు లేకున్నా వందేళ్లు పూర్తి చేసుకుందంటే అది ప్రజలు ఇచ్చిన ఉత్సాహం, బలమేనని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీరాలు పలికాడని, సూర్యచంద్రులు ఉన్నంతవరకు కమ్యూనిజం బ్రతికే ఉంటుందన్నారు. అడవుల్లో పని చేసేవాళ్లు కూడా మనవాళ్లేనని, మంచి మనస్సు, మంచి గుణం కలిగిన వారందరూ సమాజం దృష్టిలో కమ్యూనిస్టులేనని, కమ్యూనిస్టులందరూ ఏకం కావాలని ఆ రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు.
Kothagudem Urban : ప్రజా ఉద్యమాలకు దిక్సూచి సురవరం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ప్రతీ చట్టం, ప్రతీ హక్కు కమ్యూనిస్టుల ద్వారానే వచ్చిందని, ప్రశ్నించేవాడే లేకపోతే అధికార పక్షం రాజ్యహింసకు పాల్చడుతుందని అందుకే కమ్యూనిస్టు లేని సమాజం ఉండదని, ప్రతీ పేదవాడికి కష్టం వస్తే గుర్తుకు వచ్చేది ఎర్రజెండానే అని గుర్తు చేశారు. వైరా, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్ నాయక్, పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సురవరం సుధాకర్‌రెడ్డి రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఎల్లప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్) రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, టీడీపీ, మాస్ లైన్, న్యాయవాదుల సంఘం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీ, గిరిజన సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు కంచర్ల చంద్రశేఖరరావు, నాగ సీతారాములు, జేబీ, శౌరి, అంతోటిపాల్, సంకుబావన అనుదీప్, భాగం హేమంతరావు, మున్నా లక్ష్మీకుమారి, ముత్యాల విశ్వనాధం, సలిగంటి శ్రీనివాస్, అన్నవరపు సత్యనారాయణ, కనగాల అనంతరాములు, మల్లెల రామనాధం, ఆవునూరి మధు, జాటోతు కృష్ణ, శివరామకృష్ణ ప్రసాద్, భాగం మాధవరావు, మారపాక రమేశ్, లగడపాటి రమేశ్, మద్దెల శివకుమార్, వాసం రామకృష్ణ దొర, భూక్యా శ్రీనివాస్, పూనెం శ్రీనివాస్ పాల్గొని సురవరం చేసిన సేవలను కొనియాడారు. అంతకుముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.
Kothagudem Urban : ప్రజా ఉద్యమాలకు దిక్సూచి సురవరం : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు