రామవరం/భద్రాద్రి కొత్తూగూడెం : కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని టీబీజీకేఎస్ యూనియన్‌తో పాటు ఐదు జాతీయ సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా మొదటి రోజైన గురువారం కొత్తగూడెం ఏరియాలో సింగరేణి కార్మికులు విధులకు హాజరు కాలేదు.
దీంతో ఏరియాలోని బావులు బోసిపోయాయి. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం ఏరియాలో రోజుకు 56944 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ నిర్దేశిత లక్ష్యం కాగా సాధారణ రోజుల్లో రోజుకు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. జేఏసీ పిలుపు మేరకు బొగ్గు గనుల్లో సమ్మె ప్రారంభమైంది. ఏరియాలోని బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గనుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు సింగరేణి అధికారులు సమ్మె పరిస్థితిని గనుల వద్ద పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సిబ్బంది మాత్రమే విధులకు హాజరయ్యారు. జేఏసీ నాయకులు సమ్మె జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.