జూలూరుపాడు, జూలై 17 : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ అన్నారు. గురువారం ఎస్పీ రోహిత్ రాజు ఆదేశానుసారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచినపేటతండాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.4 వేల విలువ గల గుడుంబా, రూ.15 వేల విలువ గల మద్యం బాటిళ్లు, రూ.3,500 విలువ గల గుట్కా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే సరైన పత్రాలు లేని 65 వాహనాలకు రూ.8,900 జరిమానా విధించినట్లు చెప్పారు. అనంతరం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మట్కా, జూదం, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Julurupadu : చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు : డీఎస్పీ రెహమాన్