బూర్గంపహాడ్, జూన్ 18 : అధికారికంగా సొసైటీ సభ్యులు నడుపుకునే ఇసుక ర్యాంపు నుండే ఇసుక రవాణా జరగాలే తప్ప ఇష్టానుసారం ర్యాంపులు ఏర్పాటు చేసుకుని మైనింగ్ శాఖ, సొసైటీ సభ్యుల అనుమతి లేకుండా గోదావరి ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట హెచ్చరించారు. తాళ్లగొమ్మూరు పరిధిలోని గోదావరి పరిసరాల్లో ఇసుక నిల్వలను ఆయన తనిఖీ చేసి రెవెన్యూ అధికారులకు పలు సూచనలు చేశారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని సోంపల్లి అధికారిక ర్యాంపుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ క్రమంలో ర్యాంపులను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. సొసైటీ సభ్యులు అధికారికంగా నిర్వహించే ఇసుక ర్యాంపుల నుండి ఇసుక సరఫరా కావాలని, అక్రమంగా ఇసుక తరలించకుండా గోదావరి ఇసుక ఉన్న ప్రదేశాల్లో కంచెలు, కందకాలు తవ్వించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి పరిసర ప్రాంతాల్లో 24 గంటలూ నిఘా ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని, అనధికారికంగా ఇసుక తరలించే వారి వాహనాలు సీజ్ చేసి అవసరమైతే వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. ఇసుక అక్రమ రవాణా నేపధ్యంలో ఏదో ఒక సమయంలో ర్యాంపులను తనిఖీ చేస్తానని… ర్యాంపులు నిర్వహించే నిర్వాహకులు నిజాయితీగా అక్రమాలకు పాల్పడకుండా ఇసుక రవాణా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిప్యూటీ తాసీల్దార్ సమ్మయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు.