రామవరం, డిసెంబర్ 05 : పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ సంత మైదానంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల నియమావళి అమలు, శాంతి భద్రతల ఏర్పాట్లు వంటి అంశాలపై సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు, కార్యకర్తలు చట్టాలను పూర్తిగా పాటించాలని, ప్రజలను ప్రలోభపెట్టే చర్యలు, హింసాత్మక ఘటనలను ఏమాత్రం సహించబోమన్నారు.
ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ మాట్లాడుతూ.. ప్రచార ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, ధ్వని వాహనాల వినియోగం వంటి వాటికి సంబంధించి ఎన్నికల సంఘం నిర్ణయించిన మార్గదర్శకాలు అందరూ పాటించాలన్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల కోసం అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ మనీషా, ఎమ్మార్పీఎస్ నాయకులు కొంకటి కృష్ణ, తోట రాజు, సలిగంటి శ్రీనివాస్, అబ్దుల్ ఉమర్, మురాద్, బానోత్ కేస్లీ, కురుస పద్మ, గూడెల్లి యాకయ్య, ఎన్.డి రవితేజ, నిమ్మల సాగర్, గాదం రమేశ్, నాంపల్లి రాజేశ్, సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్ మెంబర్ అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.