– సింగరేణి స్థలం నుండి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ స్వాధీనం
రుద్రంపూర్, జూలై 14 : సింగరేణి కొత్తగూడెం ఏరియాకు చెందిన భూమి నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను ఎస్ అండ్ పి సి (సెక్యూరిటీ) సిబ్బంది, స్పెషల్ పార్టీ సంయుక్తంగా నిర్వహించిన దాడిలో మంగళవారం తెల్లవారుజామున పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ ప్రాంతంలోని సింగరేణి స్థలం నుండి గత కొంతకాలంగా అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతోందన్న సమాచారంతో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష్ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గస్తీ నిర్వహిస్తున్న సిబ్బంది ఇసుక లోడ్ చేస్తున్న ట్రాక్టర్ను గుర్తించి పట్టుకుని ఏరియా ఎస్ అండ్ పి సి కార్యాలయానికి తరలించారు.
ఈ సందర్భంగా అభిలాష్ మాట్లాడుతూ.. సింగరేణి భూముల నుండి అక్రమంగా ఇసుక తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖలకు అప్పగిస్తామని తెలిపారు. ఇసుక కోసం భూముల్లో అక్రమంగా గోతులు తవ్వే వారి సమాచారాన్ని పోలీసులకు అందజేస్తామని, ఇలాంటి కార్యకలాపాలపై ఇకపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో స్పెషల్ పార్టీ జమేదార్ కే.యం విక్టర్, కప్పల శ్రీనివాస్, లెనిన్ బాబు, వెంకటేశ్వర్లు, ఎం.శ్రీనివాస్, షిఫ్ట్ ఇన్చార్జి కె.కుమార్ పాల్గొన్నారు.