రామవరం, ఆగస్టు 08 : ధార్మికతతోనే సమాజ సంస్కరణ సాధ్యమని జమాతే ఇస్లామి హింద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఖాలిద్ ముబష్షీరుల్ జఫర్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మధువన్ కన్వేషనల్ హాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భౌతికవాద దృక్పథంతో నేడు సమాజంలో మానవతా విలువలు మంటకలిసి పోతున్నాయన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం ఎంతగా అభివృద్ధి చెందిన సమాజంలో చెడు కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతూ సమాజం వినాశనం వైపు అడుగులేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు మంచి నీళ్ళు లభించడం చాలా కష్టం. కానీ మద్యం ఏరులై పారుతుందన్నారు. వివాహ బంధాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఆన్లైన్ వ్యవస్థ నేడు యువతను చెడు నడత వైపు అడుగులేపిస్తుందన్నారు. సమాజంలోని చెడును దూరం చేయడం కోసం కృషి చేయడమే నిజమైన దైవ భక్తి అన్నారు. సమాజంలోని ప్రతి రంగంలో ముఖ్యంగా పేదరికానికి దిగువన ఉన్న వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఫహీముద్దీన్, జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్ ఖాన్, షరీఫ్, పట్టణ అధ్యక్షుడు షారుఖ్ యజ్దానీ, జహంగీర్ షరీఫ్, రబ్బానీ, అబ్దుల్ బాసిత్, ఆబీద్, షేహనాజ్, సఫూరా, పర్వీన్ సుల్తానా పాల్గొన్నారు.
Ramavaram : ధార్మికతతోనే సమాజ సంస్కరణ సాధ్యం : డాక్టర్ ఖాలిద్ ముబష్షీరుల్ జఫర్