జూలూరుపాడు, మార్చి 24 : సీతారామ ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని వినోబానగర్ సమీపం నుండి సీతారామ ప్రధాన కాల్వకు అనుసంధానంగా వేల్పూర్ లోని సాగర్ కాల్వకు అనుసంధానం చేసిన సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ కాల్వను సోమవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక రైతులు, గ్రామస్తులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ పనులు పూర్తికాక ముందే నీటి విడుదల అని హడావిడి చేసిన ప్రభుత్వం, రెండు రోజుల వ్యవధిలోనే నీటిని ఆపేసి ఇటు తాగునీటికి, అటు వ్యవసాయానికి నష్టం వాటిల్లే విధంగా ఆర్భాటంగా ప్రారంభించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
మరిన్ని నిధులు కేటాయించి ప్రాజెక్ట్ పనులను త్వరతగతిన పూర్తిచేయాలని, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలన్నారు. వ్యవసాయానికి నీటిని అందించి రైతులకు నష్టం కలుగకుండా చూడాలన్నారు. ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో, వైరా నియోజకవర్గ ఆడబిడ్డగా ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిత్యం ఎండగడుతూనే ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు భుక్యా వినోద్ కుమార్, ఇటుకల రాజు, యూత్ ప్రెసిడెంట్ షేక్ బాజీ, ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ చాంద్ పాషా, మండల నాయకులు భూక్య ధర్మానాయక్, నరేశ్, శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.
Sitarama Project : సీతారామ ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలి : వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి