జూలూరుపాడు, మార్చి 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమైన సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు సమీప మండలాలకు ఇవ్వకుండా బయట ప్రాంతాలకు తరలించుకుపోవడాన్ని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కామ్రేడ్ ఎస్కే ఉమర్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో శనివారం జరిగిన కార్యక్రమంను ఉద్దేశించి మాట్లాడారు. సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఏజెన్సీ మండలాలకు ఇవ్వకుండా ఇక్కడ రైతులను నట్టేట ముంచుతూ బయట ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇక్కడ జూలూరుపాడు మండలంలో ఇవ్వకుండా కాల్వ తీసి ఆ కాల్వ ద్వారా పక్క ప్రాంతాలకు తరలిస్తున్నారని, ఇక్కడ రైతులకు మాత్రం ఇవ్వడం లేదని ఇది చాలా దుర్మార్గ మైన చర్య అన్నారు. ముగ్గురు మంత్రుల కుట్రలో భాగంగా నీళ్లు వారి ప్రాంతాలకు తరలించుకుంటున్నారని విమర్శించారు. జల సూత్రాల ప్రకారం చూసుకున్నా ఇక్కడ ప్రజలకు నీళ్లు ఇచ్చినాకనే మిగులు నీళ్లని బయటి ప్రాంతాలకు తరలించాలి.
కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ప్రజలకు ఇవ్వకుండా బయట ప్రాంతాలకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే జూలూరుపాడు మండల ప్రజలకు, రైతాంగానికి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే రైతులతో కలిసి దశల వారి ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కార్యదర్శి వల్ల రమేశ్, నాయకులు బత్తుల గోపి, తెల్లo వెంకటేశ్వర్లు, రాంబాబు, రామయ్య పాల్గొన్నారు.