జూలూరుపాడు, ఏప్రిల్ 10 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలానికి సీతారామ ప్రాజెక్ట్ నీటిని అందించి, చెరువుల నింపి బీడు భూములు సాగయ్యేలా చేయాలని సీపీఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో జూలూరుపాడు మండలానికి సాగునీరు అందేలా ప్లానింగ్ రూపొందిస్తే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంతర్భాగం అయినటువంటి జూలూరుపాడు మండల రైతాంగానికి చుక్కనీరు రాకుండా రైతుల నోట్లో మట్టి కొట్టి పక్క జిల్లాలకు తరలించకపోవడం బాధాకరమన్నారు.
ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు కూడా ఇంతవరకు సరైన నష్ట పరిహారం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు పునరాలోచించి సీతారామ ప్రాజెక్ట్ నీటిని జూలూరుపాడు రైతాంగానికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వకు పిల్ల కాల్వలు ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రైతులతో కలిసి ఆందోళన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీపీఎం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేశ్, కొమ్ముగూడెం మాజీ ఎంపీటీసీ బానోతు ఈశ్వర్, మండల నాయకులు వి.చందర్ రావు, గార్లపాటి వెంకట్, గడిదేశి కనకరత్నం, జల్లిక రాధాకృష్ణ, రాచబంటి కోటేశ్వర్రావు, బోడ అభిమిత్ర, బొల్లి లక్ష్మయ్య, వెంకన్న పాల్గొన్నారు.