జూలూరుపాడు, ఆగస్టు 23 : జూలూరుపాడు మండలం వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ భూములకు సీతారాం ప్రాజెక్ట్ ద్వారా తక్షణమే కాల్వలు ఏర్పాటు చేసి నీళ్లు అందించాలని బీజేపీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొమరం భీం విగ్రహం నుంచి తాసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై తాసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతులకు నీళ్లు ఇవ్వకుండా వేరే ప్రాంతాలకి నీళ్లు తరలించడం అన్యాయం అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి కప్పుపుచ్చుకోవడానికి యూరియా కొరతను కేంద్ర ప్రభుత్వంపై నెడుతుందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనం అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేని సతీశ్, బీజేపీ మండల అధ్యక్షుడు భూక్య రమేశ్, నున్న రమేశ్, దుదుకూరు కార్తీక్, మిశ్రా సిరుపరపు ప్రసాద్, తెల్లం నరసింహారావు, అన్నవరపు సత్యనారాయణ, నిమ్మటూరి రామారావు, ధారావత్ బాలకిషన్, భూక్య రాంబాబు, చరణ్, రవి పాల్గొన్నారు.