ఇల్లెందు, ఏప్రిల్ 07 : కుల మతాలకు అతీతంగా అతి పురాతనమైన ఇల్లెందు సత్యనారాయణపురం నాగుల్ మీరా దర్గా షరీఫ్ లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. దర్గా కమిటీ మాలిక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. మొదటిరోజు సత్యనారాయణపురం గ్రామం నుండి పోకల ధమ్మక్క వారసుల ఆధ్వర్యంలో గోటితో ఒలిసిన తలంబ్రాలు, పూలు పండ్లు రకరకాల పిండి వంటలతో నైవేద్యం భారీ ఊరేగింపుతో ఘనంగా సమర్పించారు.
రెండో రోజు శ్రీరా మనవమి సందర్భంగా దర్గా ఆవరణంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. మూడో రోజు సోమవారం సీతారాముల పట్టాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా వేద పండితులతో ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా నాగుల్ మీరా దర్గాకు హిందువులు, ముస్లింలు భారీగా తరలివచ్చి పట్టాభిషేక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.