పాఠశాల దశను ముగించి ఉన్నత విద్య వైపు మొదటిసారిగా కీలక అడుగు వేస్తున్న ఇంటర్ విద్యార్థులకు ఈ పరీక్షలు ఎంతో కీలకం. చాలామంది విద్యార్థుల కెరీర్ కలలకు ఇంటరే ఆరంభం. అలాంటి వేలాది మంది విద్యార్థులు తొలిసారిగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్ విద్యాశాఖ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.
-ఖమ్మం అర్బన్, ఫిబ్రవరి 19
నిరుటితో పోల్చితే ఈసారి ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య కొంత మేర తగ్గింది. దీనికి అనుగుణంగా కేంద్రాల సంఖ్యను కూడా అధికారులు తగ్గించారు. 2025 మార్చిలో ఖమ్మం జిల్లాలో జరిగిన పరీక్షలకు 72 ఇంటర్ కేంద్రాలు ఉండగా.. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల కోసం కుదించి 66 కేంద్రాలను సిద్ధం చేశారు. నిరుడు 36,660 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. ఈ ఏడాది 35,188 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. నిరుటితో పోల్చితే సుమారు 1,400 మందికిపైగా విద్యార్థులు తగ్గారు. ఈ ఏడాది సిద్ధం చేసిన 66 పరీక్ష కేంద్రాల్లో అన్నీ జూనియర్ కళాశాలలే. గతంలో కొన్ని ప్రభుత్వ స్కూళ్లు, ఇంజినీరింగ్ కళాశాలలను ఇంటర్ పరీక్షలకు కేంద్రాలుగా వినియోగించేవారు.
ఇన్విజిలేషన్‌కు టీచర్ల కోసం ప్రతిపాదన..
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల నిర్వహణలో కీలకమైన ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తించేందుకు పాఠశాల విద్య నుంచి టీచర్లకు విధులు కేటాయిస్తున్నారు. మొత్తం 816 మంది ఇన్విజిలేషన్‌కు అవసరం కాగా.. ఇంటర్ విద్యాశాఖలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇతర విభాగాల్లోని పలువురు అధ్యాపకులు విధులు నిర్వర్తించనున్నారు. వీరు కాకుండా ఇంటర్ విద్యాశాఖలోని 373 మందిని ఇన్విజిలేషన్‌కు కేటాయించారు. మరో 443 మంది ఇన్విజిలేషన్‌కు అవసరమయ్యారు. ఇందుకోసం పాఠశాల విద్య నుంచి టీచర్లను కేటాయించాలంటూ కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖకు ప్రతిపాదనలు అందజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఈసీఆర్ కార్యక్రమం జరుగుతున్న రీత్యా ఎస్జీటీలను కాకుండా స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లను ఇన్విజిలేషన్‌కు వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.
జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు..
ఇంటర్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లాకు చేరాయి. మూడు సెట్ల ప్రశ్నపత్రాలు విడతల వారీగా చేరగా.. వాటికి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో జనరల్, ఒకేషనల్ విభాగాల్లో సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రశ్నపత్రాలు వచ్చాయి. పరీక్ష రోజు ఉన్నతాధికారులు మూడు సెట్లలో ఏది వినియోగించాలో ఇచ్చే ఆదేశాల మేరకు పోలీస్స్టేషన్ల నుంచి ఆ సెట్ ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తీసుకొస్తారు.
నేడు కలెక్టరేట్లో సీఎస్, డీవోల సమావేశం
ఇంటర్ పరీక్షల్లో ప్రతి కేంద్రానికీ చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్), డిపార్ట్మెంటల్ ఆఫీసర్ (డీవో) ఉంటారు. జిల్లాలో 66 కేంద్రాలకు సంబంధించి సీఎస్, డీవోలతో పరీక్షల నిర్వహణపై ఖమ్మం కలెక్టరేట్లో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నారు. ఫ్లయింగ్ స్కాడ్లు, డెక్ సభ్యులు, హైపవర్ కమిటీ సభ్యులు పాల్గొనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
ఇంటర్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనల మేరకు అన్ని విభాగాల సహకారం తీసుకుంటున్నాం. సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానిచ్చాం. హాల్‌టికెట్లు కళాశాలల లాగిన్‌లో ఉన్నాయి. రెండు రోజుల తర్వాత వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. నేరుగా డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావచ్చు. ఏమైనా సమస్యలుంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9948904023కి తెలియజేయవచ్చు.
-కే.రవిబాబు, డీఐఈవో, ఖమ్మం
ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షల వివరాలు..
పరీక్షా కేంద్రాలు : 66
ప్రథమ సంవత్సర విద్యార్థులు : 17,467
ద్వితీయ సంవత్సర విద్యార్థులు : 17,721
కస్టోడియన్స్ : 17
ఫ్లయింగ్ స్కాడ్లు : 03
సిట్టింగ్ స్కాడ్లు : 02
ఇన్విజిలేటర్లు : 816
ఇంటర్ విద్యాశాఖ ఇన్విజిలేటర్లు : 373
స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్విజిలేటర్లు : 443
హాజరయ్యే విద్యార్థులు : 36,660