‘ఆంధ్రప్రభ’లో దేవీప్రియ కవితలకు, మోహన్ కార్టూన్లతో ‘రన్నింగ్ కామెంట్రీ‘ ఫీచర్ బాగా ప్రాచుర్యం పొందాక ఆ ఇద్దరు ‘ఉదయం‘ డైలీలో చేరి పాకెట్ కార్టూన్ స్థలంలో అలాంటి ఫీచర్‌నే కొనసాగించారు. అప్పట్లో అది సూపర్ హిట్టు. కాలక్రమంలో ఆ ఇద్దరి స్థానంలో ‘అక్షింతలు‘ పేరుతో అదే స్థలంలో గజ్జెల మల్లారెడ్డి కవితలు, సురేంద్ర కార్టూన్లు ఆసీనులయ్యాయి. అప్పటికే పొలిటికల్ కార్టూనిస్టుగా సురేంద్ర తన కుంచె అంచును రాటుదేలించే పనిలో ఉన్నారు. నాస్కూలు డేస్‌లో సురేంద్ర కార్టూనులు నాకు ప్రాతఃస్మరణీయాలు. శరణు శరణు సురేంద్ర సన్నుత..‘ అని కీర్తనలు పాడే రోజులు కూడా!
ఓ పక్కన శ్రీధర్ సాంప్రదాయపు పొలిటికల్ కార్టూన్ శైలికీ, మరోపక్క దృఢమైన పిడికిళ్లు ఎత్తిపట్టే బహుజనుల మోహన్ కార్టూన్ శైలి మధ్య నుంచి కొంటె అయిడియాలతో సర్రున కుంచెపై కూర్చొని హ్యారీపొటర్లా దూసుకొచ్చినవాడు సురేంద్ర. సమకాలీన రాజకీయాల మీద చురకలు అంటిస్తూ గజ్జెల మల్లారెడ్డి రాసిన కవితలకు సురేంద్ర గీసిన కార్టూన్లతో వెలువడ్డ ఈ ‘అక్షింతలు‘ పుస్తకంలో నాలుగు వందల వ్యాసాలు, నాలుగు వందల కార్టూన్లు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. పేజీ పేజీకో పంచ్. ఆయన రాత-ఈయన గీత. ఒక్కోచోట గజ్జెల మల్లారెడ్డి తమలపాకుతో ఒక్కటంటే, సురేంద్ర తలుపు చెక్కతో రెండన్నాడు.
అతిశయోక్తి కాదుగానీ, కొన్నిచోట్ల మల్లారెడ్డిని కాదని తనే ఆచంట మల్లన్న అనిపించుకున్నాడు.. ఈయన కార్టూన్లకు ఆయన పద్యాలు రాశారా? ఆయన పద్యాలకు ఈయన కార్టూన్లు గీశారా అన్నది మిస్టరీ. 1988-94 మధ్య వచ్చిన ఈ అక్షింతల్లో అప్పటి రాజకీయాలను కండ్ల ముందుంచాయి. ‘అద్వానీ, నేదురుమల్లి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నుంచి మార్గరెట్ థాచరు-సద్దాం టార్చరు వరకు ఎన్నో.. ఎన్నెన్నో… బొంబాయి, కలకత్తాల్లో బాంబులు పేల్చిన నీచులున్నారు, భారత్ మీద పగబట్టిన మారీచులున్నారు… పార్టీల్లో సమ్మతి, అసమ్మతి గ్రూపుల మీద మల్లారెడ్డి గజ, కచ్ఛప కలహాల పద్యాలు’ ఉన్నాయి.
‘అవినీతిపై అసెంబ్లీలో చంద్రబాబు నిప్పులు’ అన్న వార్తకు గోడపై ‘చోర్ మచాయే-షోర్’ సిన్మా పోస్టర్ ముందు బాబు డబ్బు మూటతో దొంగ-దొంగ అని అరుస్తుంటాడు. బొంబాయి బాంబు పేలుడులో బాలీవుడ్ సినీతారలకు సంబంధాలు అన్న న్యూస్‌కు ఆకాశంలోని నక్షత్రాల మధ్యలో బాంబులున్నట్టు సురేంద్ర కార్టూను. రాజకీయాల్లో ద్విపాత్రాభినయం చేయను అని శతృఘ్న సిన్హా అంటే-కార్టూన్లో శతృఘ్న సిన్హా ‘ఎన్టీఆర్‌లా పంచపాత్రాభినయం చేస్తా‘ అంటాడు. పుస్తకంలో ఇలాంటి శతఘ్నులు ఎన్నో.
అలాగే ‘బ్లాక్‌లో తిరుపతి లడ్డూల విక్రయం‘ అన్న వార్తపై-వేంకటేశ్వరస్వామిని మొక్కుతున్న భక్తుడితో పూజారి కొంటెగా ‘కొంటారా?’ అనడుగుతాడు. ‘ఆకాశాన్నంటిన బియ్యం ధరలు’పై ఆకాశంలో చందమామను చూపిస్తూ చంటి పిల్లనెత్తుకున్న తల్లి ‘చందమామ రావె.. సబ్సిడీ బియ్యం తేవే’ అని పాడే కార్టూను. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో 464 గ్రామాల్లో స్త్రీలకు చదువులేదు. అన్న వార్తకు భర్త చితిపై కూర్చొని సతీసహగమనం చేస్తున్న భార్య వెనుకాల ఉదయిస్తున్న ‘అ’ అనే అక్షరం.. ఎంత గొప్ప సందేశం?! 80, 90వ దశకంలో వీరిద్దరికీ కాశ్మీరు ఉన్నది. మౌన పీవీ ఉన్నాడు, అయోధ్య ఉన్నది, అద్వానీ ఉన్నాడు, రాజీవ్ ఉన్నాడు, అంతకుమించి వత్తు జటాక్షర డైలాగుల ఎన్టీఆరూ ఉన్నాడు పద్యంతో గజ్జెల మల్లారెడ్డి, పంచులతో సురేంద్ర ఒకరికొకరు పోటీ పడి రాజకీయ నాయకులకు వేసిన మొట్టికాయలు ఈ ‘అక్షింతలు’. అంతేకాదు వృత్తిపరంగా సురేంద్ర-మల్లారెడ్డి ఒకరి మీద ఒకరు పోసుకున్న ‘తలంబ్రాలు’ కూడా!
ఈ ‘అక్షింతలు’ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. మల్లారెడ్డి గజ్జెలకు సురేంద్ర సవ్వడి!
– మృత్యుంజయ్