వికారాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని పలు శాఖలకు ఇన్చార్జి అధికారులే దిక్కయ్యారు. కీలకమైన రెవెన్యూ అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టులతోపాటు జిల్లా ఎస్సీ సంక్షేమం, జిల్లా యువజన, క్రీడలు, పరిశ్రమల శాఖల్లోనూ ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అన్ని శాఖలకు జిల్లా అధికారులను నియమించగా.. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నా టి నుంచి ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నది. కాగా, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు గత ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్నది. గతంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్‌శర్మను జయశంకర్ భూపాలపల్లికు కలెక్టర్ గా ప్రభుత్వం నియమించడంతో గత రెండేండ్లుగా ఖాళీగానే ఉన్నది.
జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌ను ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా నియమించడంతో గత రెండేండ్లుగా ఆయన కొనసాగుతున్నారు. జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన లింగ్యానాయక్‌ను రెండు నెలల కిందట రాష్ట్ర ఎన్నికల కార్యదర్శిగా బదిలీ చేయడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉన్నది. దీంతో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిగా పనిచేస్తున్న రాజేశ్వరికి ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.
మరోవైపు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిగా పనిచేసిన మల్లేశం గతేడాది ఉద్యోగవిరమణ పొందడంతో అప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉం డగా.. జిల్లా గిరిజన సంక్షేమాధికారి కమలాకర్‌రెడ్డి ఇన్చార్జిగా వ్యవరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారిగా పనిచేసిన హనుమంతరావు గతేడాది ఉద్యోగ విరమణ పొందడంతో అప్పటి నుంచి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎండీ సత్తార్‌కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. దీంతో అధికారులు తమ సొంత శాఖలో.. అటు ఇన్చార్జిగా అదనపు బాధ్యతలతో ఏ శాఖలోనూ సమర్థవంతంగా పనులు చేయలేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలున్నాయి.
జిల్లాలో ఇన్‌చార్జీలతో కొనసాగుతున్న పలు శాఖల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. గత రెండేండ్లుగా ఇన్చార్జి అదనపు కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్ సమర్థవంతంగా పాలన నిర్వహించడంలేదనే విమర్శలున్నాయి. ఇన్చార్జి అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ కార్యాలయంలోనే పూర్తి స్థాయిలో ఉంటుండడంతో జిల్లా పరిషత్‌లో నిర్వహణ ఆగమాగమయ్యిందనే ఆరోపణలున్నాయి.
అలాగే, జిల్లా పరిషత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం డిప్యుటేషన్‌పై వెళ్లడం తో పాలన గందరగోళంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. ఏ ఫైల్‌పై సంతకం కావాలన్నా.. జడ్పీలో పనిచేస్తున్న ఒకరిద్దరు ఉద్యోగులు కలెక్టరేట్‌కు వచ్చి సంతకాలు చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటీవల ముగిసిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా నిర్వహించిన సుధీర్‌కుమార్ వాటి నిర్వహణలో ఫెయిలయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆరు మున్సిపాలిటీలున్నా రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వెలువడితే.. జిల్లాలో మాత్రం సాయంత్రం 6 గంటలు కావడం గమనార్హం. ఎన్నికల అధికారిగా ఉన్న సుధీర్‌కుమార్ ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా కౌంటింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఫలితాల వెల్లడిలో ఆలస్యమైందనే ఆరోపణలున్నాయి.
మరోవైపు బందోబస్తు నిర్వహించాల్సిన పోలీసు అధికారులు కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఉన్నా పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కౌంటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించిన సదరు అధికారి ఎందుకు అభ్యంతరం తెలపలేరని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కౌంటింగ్ కేం దంలోకి అధికార పార్టీకి చెందిన నాయకులు వచ్చినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన సుధీర్‌కుమార్ బీఆర్ఎస్ సభ్యులు లొపలికి వచ్చే సమయంలో ఆంక్షలు విధించడం, ఎన్నికల సంఘం మీడియాను అనుమతించాలని నిబంధనలున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జడ్పీలో ఉన్న రూ.2 కోట్లతో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు తదితర వాటికి వినియోగించకుండా కమీషన్ల కోసం జడ్పీ నూతన భవన నిర్మాణానికి నిధులను వినియోగించారనే ఆరోపణలూ ఆయనపై ఉన్నాయి.