రామవరం, మే 05 : సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తూ, ప్రతి సంవత్సరం కంపెనీ టర్న్ ఓవర్‌ని పెంచుకుంటూ పోతూ అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల కాలనీలు సమస్యల నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతాలైన రుద్రంపూర్, గౌతంపూర్, రామవరం ప్రాంతాల్లోని కార్మిక నివాస ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. అధికారులు చెప్పే సంక్షేమ కార్యక్రమాలు మాటల్లో తప్ప చేతుల్లో కనబడలేదు అనే విమర్శ వినిపిస్తుంది. కాలనీల్లో 30 ఏండ్ల క్రితం వేసిన రోడ్లే ఇప్పటికి దిక్కు. దీంతో చిన్నపాటి వర్షం పడితే చాలు రహదారులు నీటి గుంటలుగా మారిపోతున్నాయి. తాత్కాలిక మరమ్మత్తులకు కూడా నోచుకోవడం లేదని అంటున్నారు కార్మికులు.
అధికారులు ఉండే కాలనీలు, కార్మికులు నివాసం ఉండే కాలనీలో పర్యటిస్తే వ్యత్యాసం స్పష్టంగా కనబడుతుందంటున్నారు. సమస్యను గతంలోనే ఏరియా జీఎం శాలెం రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సంబంధిత సివిల్ అధికారులకు తార్ రోడ్డు మరమ్మతు పనులకు టెండర్లు పిలవాలని సూచించారు. కానీ అది ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు.
డ్రైనేజీ సైతం 30 సంవత్సరాల క్రితం నిర్మించినది కావడంతో చాలావరకు పైపులు పగిలిపోయి డ్రైనేజీ వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. మ్యాన్ హోళ్లపై కనీసం పైకప్పులు కూడా లేవు. చాలావరకు మ్యాన్ హోల్స్‌పై అట్టలు, కొబ్బరి మట్టలు, పలిగిన రేకులతో కప్పి ఉంచుతున్నారు. దీంతో చెత్త చెదారం పేరుకుపోయి డ్రైనేజీ నిండిపోయి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. గతంలో గౌతమ్‌పూర్ ప్రాంతంలో డ్రైనేజీ మ్యాన్ హోల్ పై మూతలు లేకపోవడంతో ఆవు దూడ పడి చనిపోవడం జరిగింది. ఇకనైనా సివిల్ అధికారులు కాలనీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించి, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
Ramavaram : సమస్యల నిలయాలుగా సింగరేణి కార్మిక నివాస ప్రాంతాలు