రుద్రంపూర్, సెప్టెంబర్ 07 : రోడ్డు దాటుతున్న సింగరేణి కార్మికుడిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్ వద్ద చోటుచేసుకుంది. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ ఫిల్టర్ బెడ్లో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కోటేశ్వరరావు (55) నైట్ షిఫ్ట్ విధులకు హాజరయ్యేందుకు వస్తుండగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో విజయవాడ నుండి భద్రాచలం వెళ్తున్న కారు అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కోటేశ్వరరావును స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రుద్రంపూర్ ఫిల్టర్‌బెడ్ వద్ద జాతీయ రహదారి దాటే క్రమంలో సింగరేణి కార్మికుడు ఎస్.కోటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఏరియా సివిల్ విభాగం పనితీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులపై గతంలోనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా, ప్రత్యామ్నాయ రహదారి పనులు పూర్తిచేయక పోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఫిల్టర్‌బెడ్ నుండి రాకపోకలకు జాతీయ రహదారి దాటాల్సిన అవసరం లేకుండా పాత రహదారి మీదుగా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని అప్పటి ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజును కార్మిక నాయకులు కోరినట్లు తెలిపారు. దీనిపై సివిల్ అధికారులను ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ, ఫిల్టర్‌బెడ్ ప్రహరీ గోడకు ఒక గేటు ఏర్పాటు చేయడం వరకే పనులు పరిమితమయ్యాయని కార్మికులు పేర్కొంటున్నారు. రహదారి నిర్మాణం పూర్తికాకపోవడంతో గేటు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు. ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులో ఉండి ఉంటే కోటేశ్వరరావు జాతీయ రహదారి దాటాల్సిన పరిస్థితి వచ్చేది కాదని తోటి కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక కార్మికుడి ప్రాణం కోల్పోవడంతో పాటు ఓ కుటుంబం పెద్దను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి, బాధ్యతారాహిత్యంపై విచారణ జరిపించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతి
రుద్రంపూర్ ప్రగతివనం నుండి ఆర్‌సీహెచ్‌పీ వరకు జాతీయ రహదారిపై స్ట్రీట్ లైట్లు లేకపోవడం కూడా కార్మికులకు ప్రమాదకరంగా మారిందని వారు చెబుతున్నారు. రాత్రి విధులకు వచ్చే, రెండో షిఫ్ట్ ముగించుకుని వెళ్లే కార్మికులు చీకట్లో రాకపోకలు సాగించాల్సి వస్తోందని తెలిపారు. రైల్వే స్లైడింగ్ పనుల కారణంగా ప్రగతివనం వద్ద ఉన్న మోరిని మూసివేయడంతో పీవీకే–5 ఇంక్లైన్, ఆర్‌సీహెచ్‌పీ, ఎస్అండ్పీసీ ప్రాంతాలకు వెళ్లే కార్మికుల ఇబ్బందులు మరింత పెరిగాయని పేర్కొన్నారు. మరో ప్రమాదం జరగకముందే ప్రగతివనం–ఆర్‌సీహెచ్‌పీ మార్గంలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి, కార్మికుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.