రామవరం, మే 06 : గతంలో సింగరేణిలో ఉద్యోగం అంటే కేవలం పురుషులు మాత్రమే చేసేవారు, చేర్చుకునేవారు. కానీ కాలానుక్రమంగా రోజులు మారాయి, మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. సింగరేణి భూగర్భ గనుల్లో పురుషులతో సమానంగా దిగి బొగ్గు ఉత్పత్తిలో తమ భాగస్వామ్యాన్ని ఇప్పటికే చాటారు. ఇప్పుడు తాజాగా ఒక అడుగు ముందుకు వేసి రిస్క్ అనుకోకుండా రెస్క్యూలో చేరి అత్యవసర సమయాల్లో రిస్క్ ఆపరేషన్లలో తాము సైతం భాగస్వామ్యం అవుతాం అంటున్నారు. మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలో త్రీ ఇంక్లైన్ రెస్క్యూ స్టేషన్ నందు కొత్తగూడెం రీజియన్ పరిధిలో ఉన్న కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు ఏరియాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు రెస్క్యూ ట్రైనింగ్ కోసం పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో మహిళా ఉద్యోగులు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా నూతనంగా జరిగిన రిక్రూట్మెంట్లో అండర్ గ్రౌండ్ మైన్ నందు కూడా విధులు నిర్వహించుటకు మహిళా ఉద్యోగులు సింగరేణి సంస్థ నందు చేరినట్లు తెలిపారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా రెస్క్యూ ట్రైనింగ్ కు ఆసక్తి ఉన్న పద్మావతి ఖని, కొత్తగూడెం ఏరియా, కొండాపురం మైన్, మణుగూరులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు పరీక్షలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో జ ఎస్. ఓ. టు జిఎం జి.వి. కోటి రెడ్డి, ఏరియా ఇంజినీర్ కె.సూర్యనారాయణ రాజు, ఏజిఎం (సివిల్) సీహెచ్.రామకృష్ణ, ఏజిఎం (ఫైనాన్స్) కె.హాన సుమలత, డి.జి.ఎం (పర్సనల్) బి.శివ కేశవరావు, డి.జి.ఎం (ఐ.ఈ) ఎన్.యోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ జికేఓసి ఎం. శ్రీ రమేశ్, మేనేజర్ పద్మావతి ఖని ఎం.వి.ఎన్.శ్యామ్ ప్రసాద్, అదికారులు మజ్జి మురళి, బి.శంకర్ అలాగే సింగరేణి సేవ సమితి కో ఆర్డినేటర్ సాగర్, పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంధి పాల్గొన్నారు.
Ramavaram : సింగరేణి చరిత్రలోనే తొలిసారి రెస్క్యూ సేవలో మహిళా ఉద్యోగులు