ఇల్లందు : కోయగూడెం ఉపరితల గని పరిసర ప్రాంత గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని పెట్రాంచెలక స్టేజీ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సింగరేణి అధికారుల వాహనాన్ని అడ్డుకొని వినతి పత్రం అందజేశారు. 23 ఏళ్లుగా కోయగూడెం ఉపరితల గని నుంచి తమ గ్రామం మీదుగా బొగ్గు రవాణా చేస్తున్నారని, తమ గ్రామాన్ని కాలుష్య కోరల్లో పడేశారని వారు ఆరోపించారు. ఈ 23 ఏళ్లలో తమ గ్రామ అభివృద్ధికి వాటర్ ప్లాంట్ గానీ, కనీస సౌకర్యాలు గానీ, సెంట్రల్ లైటింగ్ గానీ, హెల్త్ క్యాంపులు గానీ ఏర్పాటు చేయలేదని చెప్పారు.
ఇప్పుడు బొగ్గు రవాణాతో టిప్పర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళి ఇళ్లలోకి చేరుతోందని, అయినా పట్టించుకోవట్లేదని, దానివల్ల అనేక మంది అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. పెట్రాంచెలక స్టేజి గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మించాలని, ప్రతినెల హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, ఈ ప్రాంత యువతీ యువకులకు ఉపాధి కొరకు డ్రైవింగ్, వాల్వా డ్రైవింగ్ నేర్పించాలని, యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో పెట్రాంచెలక స్టేజి మాజీ ఉపసర్పంచ్ బానోతు నాగేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.