కొత్తగూడెం సింగరేణి, సెప్టెంబర్ 19 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి సంస్ధ సి&ఎండి ఎన్. బలరాం నాయక్ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. అన్ని గనులు, ప్రధాన ఆస్పత్రిలో, డిస్పెన్సరీల్లో, డిపార్ట్మెంట్లలో, ఆఫీసుల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ రహిత సింగరేణి లక్ష్యంతో ప్లాస్టిక్ బదులుగా క్లాత్, జూట్ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సింగరేణి ప్రధాన ఆస్పత్రి స్వచ్ఛతకు ఆమడ దూరంలో ఉంది. ఫొటోలకు కోసం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారే తప్పా స్వచ్ఛత కోసం చేసిన కృషి నిల్.
క్యాజువాలిటీ ముందు పేషెంట్లు వాడిన వస్తువులను అక్కడే పడేస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తం చెత్తాచెదారంగా మారింది. క్యాజువాలిటీలో పేషంట్లను చూసేందుకు వచ్చిన వారికి, వారి సహాయకుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు అపరిశుభ్రతతో దర్శనమిస్తున్నాయి. మల మూత్ర విసర్జనకు వెళ్లాలంటే జంకుతున్నారు. మహిళల పరిస్థితి చెప్పుకోలేకుండా ఉంది. మరుగుదొడ్ల కోసం ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో నీరు లేక, చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలతో భయాందోళన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆస్పత్రిలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే, చికిత్స చేయించుకోవడం కోసం వచ్చే వారేమో గాని వారి కోసం వచ్చే వారు, సహాయకులు జబ్బునపడే ప్రమాదం ఉంటుందంటున్నారు.
Kothagudem Singareni : స్వచ్ఛత లేమిలో సింగరేణి ప్రధాన ఆస్పత్రి
Kothagudem Singareni : స్వచ్ఛత లేమిలో సింగరేణి ప్రధాన ఆస్పత్రి