– కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సింగరేణి కోల్ మైన్స్ కాంటాక్ట్ మజ్దూర్ సంగ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వినతి
కొత్తగూడెం సింగరేణి, జూలై 13 : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కోల్ మైన్స్ కాంటాక్ట్ మజ్దూర్ సంగ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఇనుప నూరి నాగేశ్వరరావు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్ లో జరిగిన సింగరేణి భరోసా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రమంత్రికి ఆయన వినతి పత్రం సమర్పించారు. సింగరేణిలో సుమారు 30,000 మంది కాంటాక్ట్ కార్మికులు వివిధ డిపార్ట్మెంట్లలో పని చేస్తున్నట్లు తెలిపారు. కాంటాక్ట్ కార్మికులకు చాలా తక్కువ వేతనాలు ఇవ్వడం వల్ల చాలీచాలని జీతాలతో భార్య పిల్లలను పోషించుకోవడం, తల్లిదండ్రులను చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని, పిల్లల చదువులకు.. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యల వైద్య ఖర్చులకు జీతాలు సరిపోక అప్పుల పాలు అవుతున్నట్లు వెల్లడించారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో అమలు చేస్తున్న ఐ పవర్ కమిటీ వేతనాలను తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన జీవో నంబర్ 22 గెజిట్ చేసి అమలు చేయాలని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని, వేతనంతో కూడిన సెలవులను కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో నాయకులు దొడ్డి నిర్మల, ఎడ్ల రాకేష్, గుర్రం సృజన్, పిట్టల రాజశేఖర్ ఉన్నారు.