మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా సెప్టెంబర్ నెల నిర్దేశిత లక్ష్యాన్ని అధిగ మించి102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం జక్కం రమేశ్ తెలిపారు. గురువారం మణుగూరు ఏరియా జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంజరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8,38,000 టన్నుల లక్ష్యానికి 85,4913 టన్నుల ఉత్పత్తి జరిగిందని తెలిపారు.
సెప్టెంబర్ లో 731మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని 14 రోజులపాటు ఆ ప్రభావంతో 9.70 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే ఓబీ వెలికితీశామని పేర్కొన్నారు. రైలు, రోడ్డు, రోప్ ద్వారా ఈ నెలలో 8,49,886 టన్నులు బొగ్గు తరలించామన్నారు. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి 55.5శాతం సాధించామని తెలిపారు. ఓసీ-2 ప్రమాద బాధిత కుటుంబాల వారికి రావాల్సిన నగదు, ఇతర బెనిఫిట్స్ వేగంగా అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ఏరియాలో కరోనా కేసులను కట్టడి చేశామని పాజిటివ్ కేసుల శాతం పూర్తిగా తగ్గించామన్నారు. మణుగూరులో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జియోథర్మల్ పనులు వేగంగా జరుగుతున్నాయని ఛైర్మన్ శ్రీధర్ దిశానిర్దేశంలో 2022 మార్చి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేవిధంగా చర్యలు చేపడుతున్నామని స్థల సేకరణ, రోడ్డు, షెడ్డు, బోర్ హోల్ తదితర ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధికారులు లలిత్‌కుమార్, ఫిడ్జరాల్డ్, వెంకటేశ్వర్లు, సలగల రమేశ్, నర్సిరెడ్డి, నాగేశ్వరరావు, శ్రీనివాసచారి, రమణ, మేరీకుమారి, సింగు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.