బూర్గంపహాడ్, జూన్ 29 : భద్రాచలం పుణ్యక్షేత్రానికి ప్రతినిత్యం భక్తులు, పర్యాటకులు వేలాది వాహనాల్లో దర్శనానికి వెళ్తుంటారు. అప్రోచ్ రోడ్డు కుంగిపోవడంతో గత కొంతకాలంగా సారపాక-భద్రాచలం మధ్యలో నూతన వంతెన మీదుగా రాకపోకలు నిలిపివేశారు. మరమ్మతులు జరుగుతున్న వంతెన రహదారి వైపు ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు అవేమీ పట్టించుకోక పోవడంతో వాహనదారులు ఎటు వెళ్లాలో తెలియక కన్ఫ్యూజ్కు గురవుతున్నారు. ఈ క్రమంలో రాత్రి సమయాల్లో ఈ వంతెన వైపు ఉన్న రహదారికి ప్రమాద సూచికలు లేకపోవడంతో ఈ రహదారిపై వెళుతూ పలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఓ యువకుడు ద్విచక్రవాహనంపై రాకపోకలు నిలిపివేసిన రహదారిపై అతివేగంగా వెళ్లి ప్రమాదానికి గురై మృతి చెందాడు.
కార్లు, ఇతర వాహనాలు సైతం బారికేడ్లు, ప్రమాద సూచికలు లేకపోవడంతో ఈ రహదారి గుండానే వెళుతూ చివరకు మరమ్మతులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని వాహనాలు సడన్‌గా ఆపి ప్రాణాల నుంచి తప్పించుకున్నారు. వంతెన వద్ద మరమ్మతు పనులు చేయించే కాంట్రాక్టర్‌తో పాటు అధికారులు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయక పోవడంతో మనుషుల ప్రాణాలంటే వీరికి లెక్కలేదా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, గుత్తేదారు స్పందించి వాహనాలు ఇటువైపుగా వెళ్లకుండా ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు, వాహనదారులు మండిపడుతున్నారు.