బూర్గంపహాడ్, జూన్ 08 : బూర్గంపహాడ్ మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఆకతాయిలు, అసాంఘీక శక్తులనుద్దేశించి ఎస్ఐ మేడా ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్, పాఠశాలలు, కళాశాలల వద్ద అమ్మాయిలను వేధించడం, బైక్ పై ర్యాష్ డ్రైవింగ్, గ్రామాల్లో గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, గుడుంబా, పేకాట శిబిరాలు, అక్రమ ఇసుక రవాణా, అక్రమ గోవుల రవాణా, మద్యం బెల్ట్ షాపులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, సమాచారం అందితే దాడులు చేస్తామని హెచ్చరించారు.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. సారపాక, లక్ష్మీపురం గ్రామాల్లో వలస కూలీల ముసుగులో నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించామని, గ్రామాల్లో అసాంఘీక కార్యకలాపాలు జరిగినా, అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించినా తక్షణమే 100కు డయల్ చేసి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.