లక్ష్మీదేవిపల్లి, సెప్టెంబర్ 24 : లక్ష్మీదేవిపల్లి మండలంలోని శేషగిరి నగర్ గ్రామ పంచాయతీ, పోస్ట్ ఆఫీస్ సెంటర్ హేమచంద్రపురం వెళ్లే రహదారిపై టిప్పర్ లారీల ప్రయాణంతో రోడ్లు దుమ్మమయం అవుతున్నాయి. రోడ్డుపై పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో కాలనీవాసులు దుమ్ము దుమారంతో తీవ్ర కాలుష్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. సింగరేణి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుండి రూ.10 కోట్ల వ్యయంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి హేమచంద్రపురం వరకు ఫోర్ లైన్ విత్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ తో రోడ్డు నిర్మాణాలు చేస్తామని సింగరేణి రూ.10 కోట్ల మంజూరుకు నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది. శేషగిరి ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు నిర్మాణ విషయంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శ్రద్ధ చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.