రామవరం, సెప్టెంబర్ 10 : మహిళలు ఆర్థికంగా స్వయం సాధికారతను సాధించాలంటే టైలరింగ్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిషన్, స్పోకెన్ ఇంగ్లీష్, జ్యూట్ బ్యాగుల తయారీ వంటి శిక్షణలే మార్గం అని, ఇలాంటి వృత్తి విద్యల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చని కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు జి.మధురవాణి అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియా 3 ఇంక్లైన్ క్లబ్ నందు కొత్తగూడెం ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో వార్షిక సంవత్సరం 2025-26 నందు నూతనంగా ప్రారంభించబోయే ఉచిత వృత్తి శిక్షణ తరగతులను, గత వార్షిక సంవత్సరంలో నేర్చుకున్న వారికి ఈ నెల 18న నిర్వహించే రాత పరీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని సేవా సెక్రెటరీ, సేవా సభ్యులతో కలిసి బుధవారం నిర్వహించారు. విశిష్ట అతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సేవా సమితి ద్వారా ఉచిత వృత్తి శిక్షణ తరగతులకు హాజరై నిరుద్యోగ మహిళలు, గృహిణులు వారి కుటుంబాలకు ఆర్థిక లబ్ధిని చేకూర్చాలన్నారు. శిక్షణ తరగతులకు శ్రద్ధగా హాజరై నేర్చుకోవాలని, ఇతరులకు నేర్పించాలన్నారు. ఈ కార్యక్రమములో డిజిఎం (పర్సనల్) జీ.వి మోహన్ రావు, పద్మజా కోటిరెడ్డి, లేడీస్ క్లబ్ సెక్రటరీ సునిత మురళి, సేవా సెక్రెటరీ వై.అనిత, సేవా సభ్యులు పాల్గొన్నారు.