కొత్తగూడెం అర్బన్, జూన్ 09 : రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సబ్సిడీపై అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐయూకెఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సంవత్సరం వానాకాలం సీజన్ ముందుగానే ప్రారంభమైన నేపథ్యంలో రైతాంగమంతా ఎంతో ఆశతో వ్యవసాయ పనులు ప్రారంభించారన్నారు. కాగా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకరాకపోవడం వల్ల రైతులు ప్రైవేట్ వ్యాపారస్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేస్తున్నట్లు, గతంలో మాదిరిగానే కల్తీ విత్తనాలతో నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చేతులు దులిపేసుకున్నదని, రాష్ట్రాల ప్రతిపాదనలను కనీసం పరిగణలోకి తీసుకోకుండా నామమాత్రపు రేట్లు ప్రకటించిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం గ్యారెంటీ చట్టం చేసి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరి కిశోర్, బానోత్ ధర్మ, మాచర్ల సత్యం, ఈసం శంకర్, పండూరి వీరబాబు, నాగేశ్వరావు, బైరు వెంకన్న, నరేశ్, గాంధీ, గొగ్గేల వెంకటేశ్వర్లు, రామారావు పాల్గొన్నారు.
Kothagudem Urban : రైతాంగానికి విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలి : అమర్లపూడి రాము