– కొత్తగూడెం రీజినల్ సెక్రటరీ మధు కృష్ణ
రుద్రంపూర్, జూలై 07 : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు సింగరేణి మైనింగ్ అఫీసర్స్ అసోసియేషన్ (CMOAI) ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హాజరై 9వ రోజు నిరాహార దీక్షలో పాల్గొన్న అధికారులు కలవల చంద్రశేఖర్,అనంతరామయ్య, కే ఎస్ ఎన్ రాజు, వీ రామకృష్ణ,అశోక్ రెడ్డి తదితరులకు తమ అసోసియేషన్ తరుపున సంపూర్ణ మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కొత్తగూడెం రీజనల్ సెక్రటరీ మధు కృష్ణ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ అభివృద్ధిలో రాత్రింబగళ్లు శ్రమిస్తూ, బొగ్గు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న అధికారుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వీడాలన్నారు. అధికారులకు న్యాయబద్ధంగా రావలసిన పీఆర్పీ PRP – Performance Related Pay బకాయిలను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలని కోరారు. అదేవిధంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న పే అప్గ్రేడేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేసి అధికారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులు తమ న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న ఈ పోరాటం అత్యంత సమర్థనీయమైనదని, వారి డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి చర్చల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. డిమాండ్ల విషయమై తమ సంఘం ప్రధాన కార్యదర్శి లింగమూర్తి త్వరలో గౌరవ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి సమస్య పరిష్కారంలో తమ వంతు కృషి చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సంఘీభావ కార్యక్రమంలో అసోసియేషన్ కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బొజ్జ వెంకటస్వామి ముఖ్య నాయకులు ఉర్సు శివ సుదర్శన్, దుర్గ ప్రసాద్, సిరంచ ప్రభాకర్, ప్రవీణ్, చందులాల్, పరశురాములు, జి.కిరణ్ కుమార్, కరుణాకర్, బీసీ సంఘాల ప్రతినిధులు రాజ్ కుమార్, హరీష్, సమ్మయ్య, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.