కొత్తగూడెం, జూలై 22 : చుంచుపల్లి మండలం బాదావత్ తండా గ్రామానికి చెందిన రైతు బాదావత్ చందా (తండ్రి సోమ్ల) తీసుకున్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మంజూరైన రూ.1,00,000 బీమా మొత్తాన్ని ఆయన నామినీ, భార్య బాదావత్ పద్మకు కొత్తగూడెం సహకార సంఘ అధ్యక్షుడు మండే వీర హనుమంతరావు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మండే వీర హనుమంతరావు మాట్లాడుతూ.. సహకార సంఘ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బీమా పథకాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గతంలో ఈ బీమా పాలసీ కింద రూ.50,000 మాత్రమే అందించేవారని, రైతు కుటుంబాలకు మరింత భరోసా కల్పించేందుకు ప్రస్తుతం బీమా మొత్తాన్ని రూ.1 లక్షకు పెంచినట్లు వెల్లడించారు. రైతులు సహకార సంఘం ద్వారా అందుబాటులో ఉన్న సంక్షేమ, బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి ఎన్.వి. రమణారెడ్డి, సంఘ డైరెక్టర్ కె. రామచంద్రారావు, రైతులు మరియు ఇతర సంఘ సభ్యులు పాల్గొన్నారు.