ఎర్రుపాలెం, ఆగస్ట్ 22 : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎం.ఎస్.ఎస్. శారదాదేవి అధ్యక్షతన శనివారం మండలస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల మండల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను వెల్లడించారు. సమావేశంలో పలువురు సర్పంచులు మండల విద్యాశాఖ అధికారి మురళీమోహన్రావు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, పలు అంశాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సమస్యలపై ఎంఈఓను నిలదీశారు. కనీసం సర్పంచులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినా వాటిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు సూచించిన సమస్యల పరిష్కారానికి స్పందించకపోవడం సరికాదన్నారు.
కొన్ని గ్రామపంచాయతీల పరిధిలోని పాఠశాలల అభివృద్ధి పనులకు సంబంధించి సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాల్లో గ్రామపంచాయతీలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పాఠశాలల అభివృద్ధి, వివిధ శాఖల ప్రగతి తదితర అంశాలపై చర్చించారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, మండల ప్రత్యేక అధికారి ఫిరంగి, తాసీల్దార్ సునీతా ఎలిజబెత్, ఎంపీఓ కృష్ణ, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.