బూర్గంపహాడ్, మార్చి 8 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సామాజిక ఆరోగ్యకేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆదివారం సర్పంచ్ మందా నాగరాజు లాంఛనంగా ప్రారంభించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 14 ఏళ్లు దాటిన ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపట్టినట్లు ప్రతి ఆడపిల్ల ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపి పాఠశాలలు, హాస్టళ్లలో ఉన్న 14 ఏళ్లు దాటిన ఆడపిల్లలు వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలన్నారు.
ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌పై మండలంలో ప్రచారం చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా 564 మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉంటుందని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, ఎంఈవో యదుసింహరాజు, సీడీపీవో రేవతి, ఉపసర్పంచ్ గుండె వెంకన్న, హెచ్ఐవో రవి, విజయ, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.