జూలూరుపాడు, మార్చి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామ సమీపంలో గల పాలగుట్ట పై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణి సహిత సంతాన వేణుగోపాలస్వామి కల్యాణం ఈ 14న జరుగనుంది. స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయానికి రంగులు వేయించి విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
కల్యాణం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచి సుప్రభాత సేవ, మంగళ తోరణములు, సుదర్శన హోమము, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం, విష్ణు సహస్రనామం, పారాయణం స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కల్యాణ వేదికకు తీసుకురావడం, మహా నివేదన నీరాజనం మంత్రపుష్పం ప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించబడునని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు తెలిపారు.