– తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు పున్నంచంద్
బూర్గంపహాడ్, మే 18 : గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు పర్మినెంట్ హోదా ఇవ్వాలని, కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలను వర్తింపచేయాలని తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు డి.పున్నంచంద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 2024లో ప్రభుత్వం నిర్వహించిన సామాజిక కుటుంబ సర్వే ఆధారంగా గ్రామాల జనాభాను పరిగణనలోకి తీసుకుని పారిశుధ్య సిబ్బందిని అధికారికంగా గుర్తించాలన్నారు. ప్రస్తుతం పని సమయంలో ప్రమాదాలు జరిగినా వైద్య ఖర్చులను కార్మికులే భరించాల్సి వస్తుందని, మెడికల్ సెలవులు లేకపోవడం వల్ల జీతం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్ని పంచాయతీల్లో నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం, 2011 జనాభా లెక్కల ప్రకారం సిబ్బంది నియామకాలు జరగడం వల్ల పెరిగిన జనాభాకు అనుగుణంగా సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. కేంద్ర జనాభా లెక్కల ఆధారంగా నియామకాలు చేయడం వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వం 2024లో నిర్వహించిన కుల, జనగణన లెక్కల ప్రకారం సిబ్బందిని నియమించి వారికి కార్మిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.