బూర్గంపహాడ్, మార్చి 24 : ఇసుక లారీల వల్ల గ్రామంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మితిమీరిన లారీల రాకపోకలతో సిమెంట్ రోడ్లు సైతం కుంగిపోయి భారీగా గుంతలు ఏర్పడుతున్నాయని ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్‌లో ఇసుక లారీల రాకపోకలను అడ్డుకున్నారు. మండల పరిధిలోని సోంపల్లి కిన్నెరసాని వాగులో ఏర్పాటు చేసిన అధికారిక ఇసుక ర్యాంపు నుండి గత కొన్నిరోజులుగా ఇసుకను లారీలతో తరలిస్తూ గ్రామస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇసుక లారీలు వెళ్లే మార్గంలో విద్యార్ధుల వసతి గృహం, బ్యాంక్, పోస్టాఫీసులు ఉండడంతో
నిత్యం వందల సంఖ్యలో విద్యార్ధులు, ప్రజలు ఈ రహదారి గుండా ప్రయాణిస్తుండటంతో ఇసుక లారీల రాకపోకల వల్ల ఎలాంటి ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందోనని భయాందోళనలు చెందుతున్నారు. ఈ క్రమంలో అడ్డూ అదుపు లేకుండా వస్తున్న ఇసుక లారీలను గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ మేడా ప్రసాద్ సిబ్బందితో అక్కడకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని శాంతింప చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.