– సర్పంచులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులతో బూర్గంపహాడ్ ఎస్హెచ్ఓ మేడా ప్రసాద్
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 11 : గణేష్ నవరాత్రి ఉత్సవాలకు నిర్వాహకులు నియమాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బూర్గంపహాడ్ ఎస్హెచ్ఓ మేడా ప్రసాద్ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో మండలంలోని 18 పంచాయతీల సర్పంచులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించారు. మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ పోర్టల్లో సమాచారం ఆన్లైన్లో నమోదు చేసుకుని అనుమతులు పొందాలన్నారు. మండపాలకు విద్యుత్ పర్మిషన్ తీసుకోవాలని, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, మండపాల వద్ద ఊరేగింపులకు ఎలాంటి డీజేలు వాడకూడదన్నారు. ఉత్సవాల సందర్భంగా ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలన్నారు.
ప్రతి గణేష్ మండపం వద్ద ముగ్గురు వాలంటీర్లు 24 గంటలూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాదాల నివారణకు ఇసుక బకెట్లు, నీటి వసతి, ఫైర్ ఎక్యూప్మెంట్ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా, రెచ్చగొట్టేలా పాటలు, నినాదాలు పూర్తిగా నిషేధమని, మండలంలో ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రులు జరుపుకోవాలని నిర్వాహకులకు సూచిస్తూ సర్పంచులు మండపాల వద్ద పర్యవేక్షణ చేస్తుండాలన్నారు. ఈ సమావేశంలో సర్పంచులు, గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులు పాల్గొన్నారు.