కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 10 : రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఘోరంగా విఫలం అయ్యారని, ఫలితంగా రైతులు నష్ట ఊబిలోకి నెట్టివేయబడుతున్నారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాధం, ఐక్యూఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుమ్మడి నరసయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, ఏఐకెఏంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాగర్ అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, జాయింట్ ఫ్లాట్ ఫేమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో బుధవారం జరిగిన సదస్సులో వారు మాట్లాడారు.
రైతాంగానికి యూరియా సరఫరాలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. దీంతో రైతులు పంటలను నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పత్తి దిగుమతి సుంకం 11 శాతం, పత్తికి క్వింటాకు రూ.10,075 చెల్లిచాలని, వర్షాలకు దెబ్బతిన్న వ్యవసాయ ఉత్పత్తులను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటల భీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా రైతులకు ప్రభుత్వం భరోసాగా ఉండాలన్నారు. రైతులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాలు తప్పవని, రైతులను సమీకరించి పాలనను స్తంభింప చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సదస్సులో కిసాన్ మోర్చా నాయకులు చంద్ర నరేంద్రకుమార్, అమర్లపూడి రాము, సలిగంటి శ్రీనివాస్, బుర్రా వెంకన్న, బానోతు ఊక్లా, కోరం వెంకటేశ్వర్లు, కట్ట నాగయ్య, బొప్పన హరిబాబు, నిమ్మల రాంబాబు పాల్గొన్నారు.
Kothagudem Urban : రైతాంగ సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం : రైతు సంఘం నేతలు