చుంచుపల్లి, మే 21 : ఎండాకాలం తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో రుద్రంపూర్ మార్కెట్ ఏరియాలో ప్రతి గురువారం నిర్వహించే వారాంత సంత ఈసారి వెలవెలబోయింది. సాధారణంగా మధ్యాహ్నం నుండే రద్దీగా ఉండే సంతలో ఈసారి సాయంత్రం ఐదున్నర గంటలు దాటినా కొనుగోలుదారులు కనిపించకపోవడంతో వ్యాపారులు నిరాశ చెందుతున్నారు. సంతలో కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులు అమ్మకానికి తీసుకొచ్చిన వ్యాపారులు వినియోగదారుల కోసం గంటల తరబడి ఎదురుచూసినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. ఎండ తీవ్రత, వడగాల్పులు అధికంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు.

ఎండ తీవ్రతతో వెలవెలబోతున్న రుద్రంపూర్ వారాంత సంత
సాయంత్రం సమయానికీ వేడి తగ్గకపోవడంతో మార్కెట్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, వ్యాపారులపై కూడా దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. “ప్రతి వారం సంతలో మంచి వ్యాపారం జరుగుతుంది. కానీ ఈసారి ఎండల కారణంగా ప్రజలు రాకపోవడంతో అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి” అని కొంతమంది కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అత్యవసర పనులు తప్ప బయటకు రావడం తగ్గించడంతో సంతపై ప్రభావం పడిందని స్థానికులు చెబుతున్నారు.